Sunday 6 October 2013

అనగనగా ఒక రోజు


 నయగరా ఫాల్స్ వ్యూ కనిపించే రూఫ్ టాప్ ఐస్క్రీం పార్లర్ లో కూర్చుని బటర్ స్కాచ్ ఐస్క్రీం తింటూ అప్పుడే షాపింగ్ లో కొన్న డైమండ్ ఇయర్ టాప్స్ చూసుకుంటున్నాను.

ఇంతలో పింక్ కలర్ యూనిఫారం వేసుకున్న ఇరవైయేళ్ల వెయిట్రస్ మేనేజర్ తో సహా వచ్చి మేడం మీరు ఈ రోజు మా లక్కీ కస్టమర్ కాంటెస్ట్ విన్ అయ్యారు అందుకని మీకు ఒన్ మంత్ వరకు మా పార్లర్ లో ఐస్క్రీం ఫ్రీ అన్నారు
థాంక్యూ చెప్దామని నోరు తెరిచాను


అదేంటి నోట్లో నుంచి కూ కూ కూ కూ అని సౌండ్ వస్తుంది. ఆందరూ నా వంకే చిత్రంగా చూస్తున్నారు.
హ్మ్ ఎహ్మ్ హ్మ్ ... ఈ సారి ఇంకా గట్టిగా కూకూ కూకూ....
చేత్తో నోరు మూసేసాను, ఇంకా కూకూ కూకూ, ఈసారి ఎక్కడో దూరం నుంచి...
అతి కష్టం మీద కళ్ళు తెరిస్తే అది అలారం.


లేచి దాని పీక నొక్కి ఫ్రీ ఐస్క్రీం కోసం మళ్లి పడుకుంటే "ధూం మచాలే ధూం మచాలే" అని వీధిలోని కారు రివర్స్ గేర్ సుప్రభాతం. ఆ కారుని  పెట్రోల్ పోసి తగలేద్దామని అమ్మో వద్దులే పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయి అని బాలయ్య బాబులా కంటి చూపుతో కాల్చేద్దాం అని లేచాను


సగం తెరిచిన కళ్ళతో గడియారం వంక చూస్తే ఎనిమిదిన్నర. అమ్మో అని లేచి గోడ పైన బాబా కి గుడ్మార్నింగ్ చెప్పి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లి టాప్ తెరిస్తే అందులోంచి  రానా వద్దా అని రెందు చుక్కల నీళ్ళొచ్చి నీ మొహానికి ఇవి చాల్లే అని ఆగిపోయాయి.



ఇక ఊరుకుని లాభం లేదు జలయజ్ఞం చెయ్యాల్సిందే అని వాచ్ మేన్ ని పిలిచి దర్భలు పట్టుకు రమ్మంటె మీది మరీ చాదస్తం అమ్మా అని మోటార్ స్విచ్చి వేసి చక్కాపోయాడు

సరే నీళ్ళొచ్చే లోపు ప్రపంచాన్ని ఓ చూపు చూద్దామని న్యూస్ పేపర్ తీసి మొదటి పేజీ లో కార్టూన్ చూసి నవ్వి, రెండో పేజీ లో చిన్న కథ చదివి, మహిళల పేజీ లో బంగారం ధర చూసి నిట్టూర్చే లోపు సినిమా పేజీ లోంచి మహేష్ బాబు, తమన్నా ఇక్కడ ఇక్కడ అంటూ అరుపులు, సరె కదా అని వాళ్ల కబుర్లు వింటుంటె నీళ్లు వచ్చెశాయి.


తొందరగా పనులు తెముల్చుకుని హాండ్ బేగ్ తగిలించుకుని బస్టాపుకి పరిగెడుతుంటె అదిగో తొమ్మిదో నంబరు బస్సులు మూడు వెళ్లిపొయాయి. స్టాపులో నుంచుంటె నేను వెయిట్ చేస్తున్నాను అని ఎలా తెలిసిందో ఆర్టీసి వాళ్లకి తొమ్మిదో నంబరు బస్సులు తప్ప అన్ని బస్సులు పంపించారు అరగంట వరకు.చివరకు నిండు గర్భిణి లా నిదానంగా వచ్చింది తొమ్మిదో నంబరు బస్సు.

 శ్రీశ్రీ ని గుర్తు చేసుకుని పదండి ముందుకు, పదండి తోసుకు అనుకుంటూ ఆ రష్ లో బస్ ఎక్కితే సీటు ఖాళీ లేదు. మటన్ ముక్క కోసం కాకి లా సీటు కోసం చూసి సీటు సాధించి కూర్చునే సరికి నేను దిగాల్సిన స్టాపు రానే వచ్చింది.

ఆఫీసులో బాసుగారికి కనబడకుండా (ట్రాఫిక్ జాం వల్ల లేటు అయ్యింది మరి) పిల్లిలా సీటు లో కూర్చుని పక్కవారిని పలకరించి సిస్టం లో మెయిలు చూసి, కొంచెం పని చేసేసరికి కడుపు లో ఎలుకలు రన్నింగ్ రేస్ మొదలెట్టెసాయి. గెలిచిన ఎలుకని ఏంటమ్మా విషయం అని అడిగితే లంచ్ టైం అయ్యింది అంది.


టైం చూసి ఫర్వాలేదు మన  జీవ గడియారం పనితీరు బాగుందని తృప్తి పడి ఆఫీసు కాంటీన్ లో అడుగు పెట్టి, కాంటీన్ వాడిని బ్రతికిద్దామని అప్పడాల్లాంటి చపాతి, నీళ్ళ లాంటి పప్పు తీసుకుని నేను బ్రతకాలి కాబట్టి సగం  వదిలేసి మళ్ళీ సీట్ లో చేరగిలబడి నాలుగు ఎనాలసిస్ లు చేసేసరికి నాలుగ్యయింది.

వేడెక్కిన బుర్రని చల్లబరచటానికి వేడి వేడి టీ తాగుతూ దేశ రాజకీయాలు ప్రపంచ విశేషాలు మీద తీవ్రంగా చర్చించి మళ్ళీ సీట్లోకి వచ్చి ఈ రోజు పని పూర్తి చేసేసరికి సాయంత్రం ఏడు.  ఆఫీస్ లోంచి బయటపడి బస్టాప్ కి వచ్చాను. రోజూ బస్టాప్ పక్కన అడుక్కునే ముసలి తాత ఈ రోజు పక్కనే ఉన్న బడ్డీలో సిగరెట్ట్ తాగుతూ కనిపించాడు. రోజూ నేనిచ్చే రూపాయితోనే బతికేస్తాడని కాదు గాని, ఎందుకో అనీజీగా అనిపించింది. ఇంతలో బస్ వచ్చింది, బస్సెక్కి రూంకి వచ్చి సర్దుకుని రూమ్మేట్స్ తో నాలుగు కబుర్లు చెప్పి రెండు, మూడు బ్లాగులు చదివి, రాత్రి భోజనం కానిచ్చి పడుకుంటే ఒక రోజు అయిపోయింది.


అంతా బాగానే ఉంది గాని ఏంటో......ఇంతే కాదు కదా జీవితం అంటె. 
ఎక్కడ వెతకాలి ఈ ఉరుకుల పరుగుల స్ట్రెస్ ఫుల్ లైఫ్ లో ఆనందం కోసం